అమెరికాలో ఓ పట్టణంలోని యావన్మంది పౌరులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి అది గ్రామం కంటే ఎక్కువ పట్టణం కంటే తక్కువ. ఉత్తర కాలిఫోర్నియాలో సంపన్నులు నివసించే చిన్న పట్టణమైన బోలినాస్ జనాభా కేవలం 1680. మొత్తం అందరికీ పరీక్షలు జరిపేందుకు పురపాలక సంస్థ నిధులను సేకరించింది యూనవర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా - శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) సహకారంతో పట్టణంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా మూకుమ్మడిగా పరీక్షలు జరపడానికి కారణం లేకపోలేదు. హైవేకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సముద్రతీర పట్టణం. ఇక్కడివారు బయటికి వెళ్లి రావడం అరుదు. అలాంటప్పుడు కరోనా ఎలా వ్యాపిస్తుందనేది డాక్టర్లు తెలుసుకోవడానికి వీలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 'మేం చాలావరకు బయటి ప్రపంచం నుంచి వేరుచేయబడి ఉన్నాం. కొన్నివారాలుగా సుస్థిరమైన పర్యావరణం మాకుంది. ఈ ప్రాంతంలో ఒకవేళ కరోనా బయటపడితే అది ఎలా వచ్చిందనేది తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది' అని యూసీఎస్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బోలినాస్ పట్టణవాసి అయిన డాక్టర్ ఏనార్ సాయర్ అన్నారు. కరోనా పరీక్షలు పూర్తిగా ఉచితంగా జరుపుతున్నారు. నాలుగు టస్టింగ్ కేంద్రాలకు ప్రజలను వలంటీర్లు తీసుకువస్తారు. అక్కడ ముక్కులోంచి స్వాబ్, వేళ్ల నుంచి రక్త నమూనాలు సేకరిస్తారు. స్వాబ్‌తో కరోనావైరస్ పరీక్షలు, రక్తంతో యాంటీబాడీస్ పరీక్షలు జరుగుతాయి. ఎవరిలో వైరస్ ఉంది, ఎవరు వైరస్ నుంచి కోలుకున్నారు అనేది ఈ పరీక్షల ద్వారా తేలిపోతుంది. ఇప్పటివరకైతే బోలినాస్‌లో ఒక్క కరోనా కేసూ బయటపడలేదు. పౌరుల్లో అత్యధికులు 60 పైబడినవారే. టెల్యూరైడ్ (కొలరాడో), పిషర్ ఐల్యాండ్ (ఫ్లారిడా) వంటి మరికొన్ని ఇతర సంపన్న ప్రాంతాలు కూడా మొత్తం అందరు పౌరులకు ఉచిత పరీక్షలు జరిపిస్తున్నాయి.
ఆ పట్టణంలో ప్రతిఒక్కరికీ పరీక్షలు జరుపుతున్నారు