జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 130 వార్డులుండగా 60 వార్డులు ఏకగ్రీవం కాగా 70 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో 13,539 మంది ఓటర్లుండగా 10,525 మంది (79.06శాతం) ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేగొండలో 1215 మంది ఓటర్లకు గాను 1009 మంది (83.05శాతం) ఓటర్లు, చిట్యాలలో 1412 మంది ఓటర్లకు గాను 1153 మంది (81.66 శాతం), మొగుళ్లపల్లిలో 3102 మంది ఓటర్లకు గాను 2377 మంది (69.87 శాతం), జంగేడులో 933 మంది ఓటర్లకు గాను 535 మంది (57.34 శాతం), గారెపల్లిలో 2913 మంది ఓటర్లకు గాను 2113 మంది (72.54 శాతం), మహదేవపూర్‌లో 1094 మంది ఓటర్లకు గాను 944 మంది (86.29 శాతం), మహాముత్తారంలో 1153 మంది ఓటర్లకు గాను 1071 మంది (92.89 శాతం), తాడిచర్లలో 1417 మంది ఓటర్లకు గాను 1323 మంది (93.37 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు 18.06 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వరకు 60.01 శాతం, మధ్యాహ్నం 12 వరకు 73 శాతం, ఒంటిగంట వరకు 79.06 శాతం పోలింగ్ జరిగింది.